ఏపీ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తిపై వయసు ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సొంత పార్టీకి ఎసరు పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ కి ప్రజాకర్షణ ఉంది అని చెప్పి.. టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా.. ఏపీకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని అంటూ, అందుకు ప్రతిగా కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దంటూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తాజాగా కర్ణాటకలో పర్యటిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.
కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారు. రాయలసీమ ప్రాంతంతో సరిహద్దును పంచుకునే కర్ణాటకలోని జిల్లాల్లో తెలుగే ప్రధాన భాష. కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. అక్కడే సెటిలైపోయి, ఆస్తులను, ఓటు హక్కును కూడా తీసుకున్న ప్రజలు తెలుగు ప్రాంతాలతో సంబంధబాంధవ్యాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అలాంటి తెలుగు వాళ్లు అంతా బీజేపీకి సహకరించవద్దు అని, కర్ణాటకలో బీజేపీని ఓడించాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు.
ఏపీ టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతుండటం పట్ల కర్ణాటక బీజేపీ నేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేఈ కృష్ణమూర్తిని ఉద్దేశించి విమర్శలు చేశారు యడ్యూర్ప. ‘ఎవరతడు? కర్ణాటకలోని తెలుగు ప్రజలకు పిలుపునివ్వడానికి అతడెవరు? ఇక్కడి తెలుగు ప్రజల బాగోగులను చూసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. ఇక్కడి ప్రజలు తెలుగుదేశం నేతలను మాటలను పట్టించుకోరు..’అని అన్నారాయన.