Home / 18+ / కరోనాపై పోరుకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్‌ నమస్తే’

కరోనాపై పోరుకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్‌ నమస్తే’

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి  భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ప్రకటించారు.‘ఆపరేషన్‌ నమస్తే’ పేరుతో కొవిడ్‌-19కు వ్యతిరేకంగా జరిగే పోరులో తాము భాగస్వాములం అవుతామని వారు వెల్లడించారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని, ఈ ఆపరేషన్‌లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనిమిది క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎల్‌వోసీ, ఎల్‌ఏసీలో ఉన్న జవాన్లు తమ కుటుంబీకుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. వారిగురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

 

ఆర్మీ కుటుంబీకులకు ఏదైనా సమస్య ఎదురైతే స్థానిక ఆర్మీ క్యాంపుని సంప్రదించాలని సూచించారు. కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోన్న సమయంలో ప్రభుత్వాలకు, అధికారులకు సాయం చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో జవాన్ల ఆరోగ్యాన్ని కాపాడుతూ వారిని రక్షించుకోవడం కూడా ప్రాధానాంశమని ఆర్మీ చీఫ్ తెలిపారు. కరోనా నుంచి మనకు మనం రక్షించుకోగలిగినప్పుడే తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలమని అన్నారు. స్వీయ రక్షణ కోసం తమ జవాన్లకు పలు సూచనలు చేశామన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్లు తమ సెలవులను రద్దు చేసుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందన్నారు.  అయినప్పటికీ 2001-02లో జరిగిన ఆపరేషన్‌ పరాక్రమ్‌ కాలంలో 8నెలలపాటు సెలవులు తీసుకోలేదని గుర్తుచేశారు.