ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మానసిక వత్తిడి.. మరోవైపు ఆకతాయిలు వేధింపులు..కారణమేదైనా అంతిమంగా బలైపోతోంది విద్యార్థులే. నిన్నటికి నిన్న హైదరాబాద్ నగర పరిధిలోగల మాదాపూర్
చైతన్యకళాశాలలో సెట లాంగ్ టర్మ్ కోచింగ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే.. దుండిల్‌లోని సూరారం కాలనీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మౌనిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే.
ఈ నేపథ్యంలో.. అసలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్న కారణాలేంటీ ? ఇందులో విద్యా సంస్థలు..ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ? విద్యార్థినుల ఆత్మహత్యలు ఆగాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ ? అనే అంశంపై చర్చోపచర్చలు కొనసాగుతుండగానే కృష్ణా జిల్లా నిడమానూరులో మరో ఘటన చోటుచేసుకుంది. నిడమానూరు పరిధిలోగల ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న భార్గవసాయి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మృతుడు రాయచోటికి చెందిన వాడని, భార్గవసాయి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, భార్గవసాయి మృతికి కారణం.. మానసిక వత్తిడా..? ఆకతాయిల వేధింపులా.? లేక మరేమైనానా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితానివ్వడం లేదు. దీంతో విద్యార్థులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కళాశాలల్లో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తల్లిదండ్రులది. ఈ ఘటనలపై అటు ప్రభుత్వాలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు కౌన్సిలింగ్ వంటి కార్యక్రమాలు చేపడితే ఇటువంటి ఘటనలను నివారించవచ్చనేది విశ్లేషకుల మాట.