రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష విధించి వెంటనే ఉరి తీయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అత్యాచారానికి గురైన బాలికను ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు శుక్రవారం రాత్రి ఆమె స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పసిపిల్ల అఘాయిత్యానికి గురవడం చూస్తే మాట్లాడటానికి కూడా మాటలు రావడం లేదన్నారు. ఇలాంటి వారిని శిక్షించేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అత్యాచారం చేసిన వారిపై నిర్భయ కేసు నమోదు చేశారని, వారిని న్యాయస్థానంలో కూడా త్వరగా శిక్ష పడేలా చేయాలని మంత్రి తెలిపారు.
