కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అంతు లేకుండాపోతున్నట్లుగా ఉంది. జగ్గయ్యపేట లో ఆ పార్టీనేతలే ఉద్రిక్త వాతావరణం సృష్టించడం శోచనీయం. వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు తెరలేపి చైర్మన్ ఎన్నిక హాల్‌లో బారికేడ్లను తొలగించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు.
మెజార్టీ లేకపోవడంతో ఓడిపోతామనే భయంతో ఎన్నిక నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు కౌన్సిల్ హాల్‌లోని టేబుళ్లను ఎత్తిపడేశారు. ఎన్నిక జరపాలంటూ వైఎస్‌ఆర్ సీపీ ఇచ్చిన మెమోరాండంను చించివేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైక్‌ను తగులబెట్టారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతల తీరుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రలోభాలతో తమ కౌన్సిర్లను కొనాలని చూశారని, ఫలించకపోవడంతో ఎన్నిక వాయిదా అంటూ కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మొత్తం 27 కౌన్సిలర్ స్థానాలకు వైఎస్‌ఆర్ సీపీ 16 కైవసం చేసుకోగా, టీడీపీ 10 స్థానాలకే పరిమితమైంది. అయితే టీడీపీ నాయకులు ,కార్యకర్తలు చేసే రౌడియిజాన్ని, దారుణాలను ఏపీ ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.