రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోందని ఈ పరిస్థితుల్లో రాజన్న రాజ్యం కోసం ‘వైఎస్సార్ కుటుంబం’లో భాగస్వామ్యమై సుపరిపాలనకు నాంది పలకాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం 39వ డివిజన్ లక్ష్మీనగర్‌లోని జన్మభూమినగర్‌లో ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేశారు.
ఎన్నికల ముందు సుమారు 600కు పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా…ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. చంద్రబాబు తమను మోసం చేశారనే భావన అన్ని వర్గాల ప్రజల్లో నెలకొందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని గుర్తుచేశారు. మళ్లీ రాజన్న రాజ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాల్లాంటి పథకాలతో కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కుటుంబంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.