ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమ్మాయిలపై ప్రొఫెసర్ వేధింపుల పర్వం వెలుగు చూసింది. ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేస్తే తమ భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతో చాలామంది మౌనంగా భరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టిన ఘటనలు ఉన్నాయి.
తాజాగా సంస్కృత విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఏడుకొండలుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనపై గతంలోను ఈ ఆరోపణలు వచ్చాయి. వీటిపై వర్సిటీ కమిటీ వేసి విచారించింది. అనంతరం న్యాయమూర్తులతోను విచారణ చేయించారు.
అప్పట్లో మహిళా ప్రొఫెసర్లు, కమిటీ సభ్యులు సంస్కృత విభాగంలోని చాలామంది విద్యార్థినులను వ్యక్తిగతంగా పిలిచి విచారించగా ఆచార్య ఏడుకొండలు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నదీ వివరించారు. చివరకు ఏడుకొండలు తీరుపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ నిర్ధరించింది. అనంతరం రెండేళ్లపాటు పాలన పదవులకు దూరం పెట్టాలన్న కమిటీ సూచనను అధికారులు అమలు చేశారు. ఆ గడువు ముగియడంతో గత మే నెలలో ఆయనకు విభాగాధిపతి పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి వేధింపులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏయూ రెక్టార్ ప్రొఫెసర్ గాయత్రీదేవి కూడా గతంలో ఏడుకొండలు కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఆమె కోర్టును ఆశ్రయించారు. తనను క్షమించమని ఏడుకొండలు లిఖితపూర్వకంగా కోరడంతో ఆమె తన కేసును ఉపసంహరించుకున్నారు. సంస్కృత విభాగంలోని విద్యార్థినుల మరుగుదొడ్లలో అప్పుడప్పుడూ కండోమ్‌లు కూడా కనిపిస్తున్నాయని కొందరు ఆవేదన చేస్తున్నారు. తమ ఆరోపణలు అవాస్తవాలని కొట్టి పారేస్తారన్న ఉద్దేశంతో వాటిని ఫొటోలు తీశామని వాటిని మీడియా ప్రతినిధులకు చూపించారు. తరగతి గదిలో సైతం ఏడుకొండలు తీరును భరించలేకపోతున్నామని అంటున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఏడుకొండలు కొట్టిపారేశారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పలువురు విద్యార్థులకు నిర్ణీత హాజరు లేదని, వారిని పరీక్షకు పంపించమని చెప్పడంతో ఇలా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏడు కొండలు వేధింపులు తట్టుకోలేక తాము క్లాసులకు కూడా వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు కంటతడి పెడుతున్నారు.
సోమవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. హాజరు సరిపోలేదనే కారణంతో, పలువురు విద్యార్థులకు ఏడుకొండలు హాల్‌టికెట్లు నిలిపివేశారు. దీంతో, వారంతా చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. అటుగా వచ్చిన సీనియర్ ప్రొఫెసర్, రెక్టార్ గాయత్రిదేవికి తమ గోడు వినిపించారు. ఏడుకొండలుతో ఆయన చాంబర్లో గాయత్రిదేవి, ఇతర ఆచార్యులు చర్చించారు. ఇంతలో కొందరు విద్యార్థులు చాంబరులోకి చొచ్చుకొచ్చి స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న రోజులకు హాజరుని ఎందుకు పరిగణించలేదని నిలదీశారు. వారు మెరుపు ఆందోళన నిర్వహించారు. ఆ ప్రొఫెసర్‌ను చితకబాదారు. ముందు వరుసలో అమ్మాయిలు కూర్చోవాలని షరతు ఏడుకొండలు చేష్టలకు భయపడే తాము తరగతులకు హాజరుకావడం లేదని రెక్టార్‌కు విద్యార్థులు వివరించారు. క్లాసులో అమ్మాయిలు ముందు వరుసలో కూర్చోవాలని ప్రొఫెసర్ షరతు పెట్టారని, పొరపాటున అబ్బాయిలు ఉంటే ఊరుకోరని, తమ ఎదుటే శృంగార పాఠాలు బోధిస్తారని, ఆ సమయంలో స్త్రీని ఎంతో దారుణంగా వర్ణిస్తారని, హావభావాలూ ప్రదర్శిస్తారని, ఆయన తీరుతో సిగ్గుతో చచ్పిపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.