వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం అనంతపురుం జిల్లాలో కొనసాగుతోంది. రోజు రోజుకి పాదయాత్రకు ప్రజాస్పందన పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. అదికూడా టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గాల్లో ఎవరూ ఊహించనంత ప్రజా స్పందన పాదయాత్రకు వస్తోంది. ప్రజాసంకల్పయాత్ర బుధవారం రుద్రంపేట బైపాస్ శివార్ల నుంచి మొదలైంది. జగన్‌ను కలిసేందుకు యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు.
పరిటాల కోటలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బాగా సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. సొంత జిల్లా కడప కంటే కూడా కర్నూలు జిల్లా, అంతకు మించి అనంతరపురం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర జోరుగా సాగుతోంది. నిజానికి అనంతపురంలో వైసీపీకీ అంత పట్టులేదు. మొత్తం 14 నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది కేవలం 2 చోట్ల మాత్రమే. అందులో కూడా ఒకరు పార్టీ ఫిరాయించారు. దాంతో జిల్లా వ్యాప్తంగా వైసిపికి ప్రజాప్రతినిధల బలం పెద్దగా లేదనే చెప్పాలి.
అటువంటి పరిస్ధితిలో అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే ముందు వైసిపిలో పాదయాత్ర విజయవంతమవ్వటంపై అనుమానాలుండేవి. అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించే సమయానికి అనుమానాలు తొలగిపోయాయి. తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో అయితే, ఊహించని జన స్పందన కనబడటంతో వైసిపిలో ఉత్సాహం స్పష్టంగా కనబడింది. దానికి తోడు బహిరంగ సభ కూడా సక్సెస్ అవ్వటంతో వైసిపిలో రెట్టించిన ఉత్సాహం కనబడింది.
అదే ఊపులో జగన్ శింగనమల నియోజకవర్గం తర్వాత రాప్తాడులోకి ప్రవేశించారు. రాప్తాడు నియోజకవర్గమంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిటాల కంచుకోట ఇది.
ప్రస్తుతం పరిటాల రవి భార్య పరిటాల సునీత మంత్రిగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్ పాదయాత్ర ఎలా జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే యాత్ర ప్రారంభం అయిన తర్వాత అనుమానాలన్నీ తొలగిపోయాయి.పరిటాల కంచుకోటలో ఊహించని ప్రజా స్పందన రావడంతో పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు.అంతేగాక పరిటాల రవి చనిపోయినప్పుడు ఎంత జనం వచ్చారో అంతకంటే ఎక్కువగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పాయాత్రకు వచ్చారని స్థానిక వైసీపీ నాయకులు అంటున్నారు.