ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ వాక్‌విత్ జగనన్న కార్యాక్రమానికి వైసీపీ పార్టి పిలుపునిచ్చింది. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఓ ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
గత ఎడాది నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. జననేత పాదయాత్ర తమ ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటుతుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసేశారు. సైదాపురం గ్రామస్థులు 25 అడుగుల విజయ సంకల్ప స్థూపం ఏర్పాటు చేశారు. దీంతో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో ఏపీ రాజకీయంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని వైసీపీ కార్యకర్తలు,ఎమ్మెల్యేలు అంటున్నారు.
