వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక అదికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వీరి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా గుర్తుకురాని ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
