టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఏడాదిగా వివేకానందరెడ్డి వీర్యగ్రంథి (ప్రొస్టేట్) కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఈ నెల 13న కుటుంబసభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా వివేకానంద ఆరోగ్యం మరింత క్షీణించింది. బుధవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇంతలోనే ఆనం వివేకానంద మృతి ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. నెల్లూరులో గురువారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి వార్తను తెలుసుకొని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇతర నేతలు తదితరులు ఆసుపత్రికి చేరుకొని ఆనం కుటుంబసభ్యులను పరామర్శించారు. గురువారం వివేకా భౌతికకాయాన్ని సందర్శించటానికి సీఎం చంద్రబాబు నెల్లూరుకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వచ్చి నివాళులర్పించిన తర్వాత ఆయన తిరిగి వెళ్లనున్నారు. బుధవారం రాత్రి వివేకా పార్థివ దేహం నెల్లూరుకు చేరుకుంది.