ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనలో నిందితుడైన వృద్ధుడు రామ సుబ్బయ్య మరణంపై అనుమానాలు మొదలయ్యాయి. సుబ్బయ్యని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు మృతదేహం ఫోటోను చూపించిన తర్వాత.. వాళ్లు తమ వాదనను వినిపిస్తున్నారు. సుబ్బయ్య కాళ్లు నేలను తాకినట్లుగా ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలకు దిగారు.
మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా సుబ్బయ్యను చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. ‘మా చేతుల్లో చావలేదని బాధపడుతున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుబ్బయ్య కొడుకును కూడా ఉరితీయాలి’ అని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య 48 గంటల హైడ్రామా తర్వాత శవమై తేలాడు. గురజాల మండలం దైద వద్ద అటవీలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. సుబ్బయ్య ఉరివేసుకున్నది ఎప్పుడనేది వైద్యులు నిర్థారిస్తారని డీజీపీ తెలిపారు