రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ విమర్శించారు. పేదలకు రావాల్సిన పింఛన్లు కూడా అడ్డుకుంటారని, మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో పేదలకు సైతం పింఛన్లు రాకుండా ఫోన్లు చేసి మరీ అడ్డుకుంటారని హోం మంత్రి చినరాజప్పపై వైఎస్ జగన్ పరోక్షంగా ఆరోపణలు చేశారు. 220వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో బుధవారం వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించారు. పెద్దాపురంలోని వేములవారి సెంటర్‌లో జరిగిన ఈ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి భరోసానిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు జగన్.
