ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. అధినాయకత్వం వ్యవహార శైలితో తెలుగు దేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుండటాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీలో ఉండలేమంటూ బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నియోజకవర్గం రాప్తాడుకు చెందిన నాయకుడు నలపరెడ్డి శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, సునీత తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా నలపరెడ్డి ఆరోపించారు. రాప్తాడులో పరిటాల సునీత అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు.
