కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గ చరిత్రలోనే చిరస్థాయిగా నిలచిపోయేలా వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మొదటిసారిగా పత్తికొండ కి వస్తున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది స్వాగతం పలికారు. నియోజక వర్గంలోని..పగిరాయి.. జోన్నగిరి నుండి దాదాపుగా 500 వాహానాలతో ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. స్థానిక చక్రాళ్లరోడ్డులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా పత్తికొండ–గుత్తిరోడ్డు కూడలికి వచ్చారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. టీడీపీ కంచుకోటగా ఉన్న పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ జెండాను రెపరెపలాడించి అఖండ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. రాష్ట్రంలోనే మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటిస్తే..అదే స్ఫూర్తితో ప్రజలు గెలిపించారన్నారు.
పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన పేదలందరికీ నవరత్నాల పథకాలు అందుతాయన్నారు. గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందులు స్వయంగా చూశానని, వాటి పరిష్కార మార్గం కోసం నిత్యం కృషి చేస్తానన్నారు. ఫ్యాక్షన్ ఊబిలో ఉన్న పత్తికొండను అభివృద్ధి కొండగా మార్చడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. పదేళ్ల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ నీరు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా.. తక్షణమే వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, పింఛన్‌లు అందిస్తామన్నారు. ప్రజలందరి అండదండలతో తన భర్త నారాయణరెడ్డి ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుస్తానన్నారు. ఎవరికి ఏకష్టం వచ్చినా ‘అమ్మా’ అని పిలవగానే పలుకుతానన్నారు. 2024 ఎన్నికల నాటికి పత్తికొండలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి జగనన్నకు రెండో కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు.