ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సమున్నత లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. అవినీతి రహిత, పారదర్శక సంక్షేమ పాలనే తమ సర్కారు లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను అప్పగించినా, తమ ప్రభుత్వ ప్రాధామ్యాల మేరకు ఉన్నంతలో బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,27,974.99 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం శానససభలో ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ‘జగనన్న అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యా దీవెన’, రైతులకు భరోసా, యువతకు చేయూత, వృద్ధులకు పింఛన్లు, అందరికీ ఇళ్లు, దశల వారీగా మద్య నిషేధం తమ సర్కారు ప్రాధామ్యాలని వివరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు అన్ని వర్గాలకూ భరోసా కల్పిస్తాయని, వీటి అమలు దిశగా బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదించామని అన్నారు. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. పార్టీలు అసలే లేవు.. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి.. మాత్రమే సర్కారు లక్ష్యమని బడ్జెట్ ప్రతిపాదనలు రుజువుచేశాయి. సంక్షేమరథాన్ని ఉరకలెత్తిస్తూ రూ. 2,27,974 కోట్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019–20 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
