టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి షాకిచ్చింది కోర్టు.. గతంలో నమోదైన గృహహింస కేసులో షమీని వెంటాడుతూనే ఉంది… ఈరోజు పశ్చిమ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసీద్ అహ్మద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. భార్య వ్యవహారంతో గతంలో కొన్ని రోజులు క్రికెట్‌కు దూరమయ్యాడు షమీ. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. అక్రమ సంబంధాలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా బయటపెట్టింది.. అంతేకాదు.. షమీ, అతని కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. ఇంకో వైపు పాక్‌కు చెందిన ఓ యువతితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేశాడని చెప్పింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ.. షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి విచారణ జరిపింది.. అయితే, అతడు నిర్ధోషిగా తేలడంతో జట్టులో మళ్లీ చోటు దక్కింది. రీ ఎంట్రీ తర్వాత వరల్డ్‌కప్‌తో పాటు విండీస్ పర్యటనలోనూ రాణిస్తున్న సమయంలో కోర్టు షాకిచ్చింది. అయితే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న షమీ స్వదేశానికి తిరిగి రాగానే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.
