చలో ఆత్మకూరు సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144సెక్షన్ అమల్లో ఉన్నా రాజధాని ప్రాంతంలో హల్‌చల్ చేస్తూ ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంతో కావాలని విరుచుకుపడుతున్నారు. సాటి మహిళా పోలీసులు అనికూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు వారిపై దూషణలకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధులనుంచి వెళ్లిపోయిన ఘటన జరిగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర మహిళాకమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితతో పాటు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దళితులవల్లే దరిద్రం అంటూ విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని దారుణంగా నోరు పారేసుకున్నారు. ఈ టీడీపీ నేత వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సీనియర్ నాయకురాలిగా పనిచేసిన నన్నపనేని ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
తమపై అనుచిత వ్యాఖ్యలుచేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు తాను ఫిర్యాదు చేయనున్నట్టు వివరించారు. అంతకుముందు చంద్రబాబు నివాసం వద్దే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలాడారు. మాజీమంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్‌ఐతో దురుసుగా ప్రవర్తించారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా హల్ చల్ చేయడం, గొడవలు చేయడం వంటివి చూస్తే కావాలనే చంద్రబాబు ఆదేశాలతో వీరంతా ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు స్పష్టమవుతోంది.