తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన ప్రమాదం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ వద్ద జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నిబంధనలు రూపొందించి అమలు చేస్తామన్నారు.
మరోసారి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బాధిత కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. మరోవైపు వశిష్ట గోదావరి లో ఇంకా పడవ ప్రమాద బాధితుల కోసం వెతుకులాట కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఈఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా 27మంది సురక్షితంగా బయటపడ్డారు. సుమారుగా మరో 2 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లు ఇతర ఆధునిక పరికరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా తూర్పుగోదావరి జిల్లా పడవ ప్రమాద ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు.