విశాఖపట్టణంలో ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం జరిగిన మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు అధికార, రాజకీయ ప్రముఖులు హాజరై మహాస్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా ఉదయం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణ్యం శ్రీస్వరూపానందేంద్రను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున ఎంపీ విజయసాయిరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారు విజయసాయిరెడ్డికి శుభాశీస్సులు అందజేశారు. ఇక స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నవారిలో డిప్యూటీ స్పీకర్ కోనరఘుపతి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, భూమన కరుణాకర్ రెడ్డి, కరణం ధర్మశ్రీ దంపతులు, మేడా మల్లికార్జునరెడ్డి దంపతులు, , పెందుర్తి వైసీపీ ఇన్‌చార్జి అన్నపురెడ్డి అదీప్‌రాజ్ దంపతులు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీటీడీ జేఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. శ్రీ స్వరూపానందేంద్ర జన్మదినం సందర్భంగా చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేయడంతో పోలీసులు గట్టిబందోబస్త్ ఏర్పాటు చేశారు.