అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాజీ పోలీసు అధికారి.. అనంతపురం జిల్లా హిందూపూరం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై మాధవ్ మండిపడ్డారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను ముద్దాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డికి హితవు పలికారు. ప్రజల ధన మాన ప్రాణాలను.. దేశ సమగ్రతను, సారభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో అమరవీరులైన పోలీసు వీరుల బూట్లను ముద్దాడుతున్నానని ఎంపీ మాధవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాంటి పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోలీసులపై వ్యాఖ్యలు చేస్తే జేసీని ప్రజలు బజారుకీడ్చారని.. రాజకీయ సమాధి కట్టారన్నారు. జేసీ మాట్లాడుతుంటే దుర్యోధనుడిలా టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వారని విమర్శించారు.
