ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి తగిన విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గంటా నలభై నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర అంశాలపై ఒక లేఖ అందిస్తూ అందులోని విషయాలన్నింటినీ స్పష్టంగా వివరించారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి.. ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం శాసన మండలి ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది అంటూ వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
