నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ ఎస్ పేట దర్గాను సందర్శించేందుకు వచ్చి లాక్ డౌన్ అయిన 329 మంది భక్తులపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. భక్తుల అవస్థలను తెలుసుకుని భోజన, వైద్య వసతులను ఏర్పాటు చేయాలని వక్ఫ్ బోర్డు అధికారులు, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసారు. ఎక్కడైనా లాక్ డౌన్ పాటించకపోతే మానవత్వంతో అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారని, ప్రజల నుంచి కూడా బాధ్యత, సామాజిక స్పృహ అవసరం అన్నారు. లాక్ డౌన్ అయిన నేపథ్యంలో భక్తులు ఎవరెవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వివరాలను సేకరించాలని సూచించారు.
కచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ భోజనాలు అందించేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. దర్గా వద్ద ఆగిపోయిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూడాలని వక్ఫ్ బోర్డు అధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ప్రభుత్వాలు పని చేస్తోంది, కొన్ని ప్రత్యేక సందర్భాలలో కఠినంగా ఉండేది కూడా ప్రజల కోసమేనన్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మసీదులలో గ్రూపులుగా ప్రార్థనలు చేయవద్దని, ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఫత్వా జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరి క్షేమం కోసం లాక్ డౌన్ పాటించడం ప్రతి భారతీయ పౌరుడి బాధ్యతన్నారు.