వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులతోపాటు ప్రజలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగులు వేస్తూ ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు.
అయితే, నిన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీకి కంచుకోట అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సభలకు జనం లేరని అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ తిప్పికొట్టారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొత్తం కలిసి సభలు పెట్టినా వైఎస్ జగన్ పొదలకూరులో పెట్టిన సభకు వచ్చినంత జనాభా కూడా రారన్నారు. మీకు సవాల్ విసురుతున్నా.. నెల్లూరు జిల్లాలలో చంద్రబాబుతో సభ పెట్టుకోండి… అధికారాన్ని ఉపయోగించుకోండి.. పోలీసులను వాడుకోండి జగన్ మోహన్‌రెడ్డికి వచ్చిన పదో వంతు జన సమీకరణ చేయలేరని ఎద్దేవ చేశారు. సింహం లాంటి నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కావాలా..? పప్పు లాంటి నాయకుడు కావాలా..? అంటూ ప్రశ్నించారు నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్‌కుమార్ యాదవ్.