ఏపీ అధికార టీడీపీలో దళితులపై వివక్ష చూపుతున్నారని ఎస్.సిలు మాల, మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదని మాలమహానాడు జాతీయఅద్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళితులు టీడీపీకి మద్దతు ఇవ్వొద్దని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన కోరారు. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో భారీ నీటిపారుదల, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖలు దళితులకు కేటాయించారని., కాని ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో ఎస్.సిలకు ప్రాధాన్యత లేదని ఆయన అన్నారు. అంతే కాకుండా పాలిట్ బ్యూరో నుంచి చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను తొలగించారని ఆయన అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన మండలిలో పార్టీ నాయకులను నామినేట్ చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఒత్తిడి తీసుకురావడం వల్లే గిరిజన సలహా మండలి నియమించారన్నారు.
