ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై సొంత క్యాస్ట్ నుంచే వ్యతిరే సెగలు చెలరేగుతున్నాయి. కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఊరించి ఊరించి తిరుమల పాలక మండలి బోర్డు చైర్మన్ పదవిని కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ చేతిలో పెట్టారు బాబు. దీంతో ఇప్పటి వరకు ఈ పదవిని తమకే కట్టబెడతారని భావించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఒక్కసారిగా బాబుపై ఫై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని పట్టుకొని బాబు పై ఒంటి కాలు పై లేస్తున్నారు. తాము ఎంత చేసినా చంద్రబాబుకు కనిపించడం లేదని కమ్మ వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. బాబు పాలనలో కమ్మ వారికి సరైన గుర్తింపు లేదని విమర్శలు మొదలు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ…ఇప్పుడు కానీ బాబు కమ్మలకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు.
ముఖ్యంగా టీటీడీ చైర్మన్ వంటి కీలకమైన పదవిని తమకు ఇవ్వలేదని వారు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఐదుగురు రెడ్డి కులస్తులకు ఈ పదవిని కట్టబెట్టారని.. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కమ్మ వర్గానికి ప్రాదాన్యం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఛైర్మన్ పదవిని ఒక్కసారి మాత్రమే కమ్మ వర్గానికి కేటాయించారని.., అప్పటి సీఎం ఎన్టీఆర్ ఇచ్చారే తప్ప చంద్రబాబు ఇవ్వలేదని అంటున్నారు. 1983లో దేవినేని శీతారామయ్యకు ఆ పదవి ఇచ్చిన తరువాత మరొక కమ్మ కు ఆ పదవి ఇవ్వలేదని వారు విమర్శిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా కళా వెంకటరావు(బీసీ తూర్పుకాపు) కె.రామచంద్రరాజు(క్షత్రియ), కాగిత వెంకటరావు(బీసీ గౌడ) పప్పుల చలపతిరావు(బీసీ,తూర్పుకాపు) ఆదికేశవులనాయుడు (బీసీ-బలిజ కాపు) చదలవాడ కృష్ణమూర్తి(బీసీ-బలిజ కాపు)లకు ఇచ్చారు.
తాజాగా పుట్టా సుధాకర్ యాదవ్‌కు బాబు ఈ పదవిని అప్పగించారని కమ్మ వర్గానికి చెందిన, టీటీడీ పదవి వస్తుందని భావించిన వారు చెప్పారు. వాస్తవానికి రాజకీయాల్లో కులం పాత్ర పెద్దగా లేని రోజుల్లోనే కమ్మ వర్గానికి ఆ పదవి దక్కిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కులం కీలకంగా మారి పోయిందని, కమ్మ సామాజికవర్గానికి ఈ పదవి దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత తమ కులం వాడైనా.. తమకు మాత్రం పదవుల పంపకంలో అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఇలా మొత్తంగా కమ్మ సామాజిక వర్గంలో టీటీడీ చిచ్చు పెట్టింది. కాగా, టీటీడీ చైర్మన్ పదవిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు మురళీమోహన్, రాయపాటి సాంబశివరావులు ఆశించిన విషయం తెలిసిందే. వీరిలో రాయపాటి మరింత దూకుడు పెంచి తన ఎంపీ సీటును త్యాగం చేసేందుకు సైతం రెడీ అయిన విషయం సంచలనం సృష్టించింది. అయినా కూడా రాజకీయ సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు.. పుట్టా సుధాకర్ యాదవ్‌కే మొగ్గు చూపారు.. దీంతో ఈ వ్యవహారం కులం రంగు పులుముకొందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.