రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, అటు ప్రైవేటు ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతోంది.
అయితే, తాజాగా నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానం ద్వారానే భర్తీ చేసేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. అంతేకాదు.. ఔట్ సోర్సింగ్ విధానం ద్వారానే మంచి ఫలితాలు ఉంటాయని సీఎం చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో ఆరు వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. వాటిని కూడా ఔట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ చేయనుంది చంద్రబాబు సర్కార్.
