టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు ఆదేశాలతో దీనిపై అధ్యయనం చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే, ఎవరెవరికి ఈ భృతిని ఇస్తారు? ఎంత మందికి ఇస్తారనే అనుమానాలు అందర్లోనూ నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. ఇందులో నిరుద్యోగ భృతికి సంబంధించిన నియమ నిబంధనలను పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో కూడా రిజిస్టరై ఉండాలి.
కనీసం ఇంటర్ చదవి ఉండాలి.
టెక్నికల్ అయితే కనీసం ఐటీఐ చదివి ఉండాలి.
18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పేద కుటుంబాలవారికే ఈ భృతిని వర్తింపజేస్తారు.
కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు.
సంబంధిత కుటుంబం రేషన్ తీసుకుంటూ ఉండాలి.
స్వయం ఉపాధి పథకాల్లో కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో కానీ లబ్ధిదారులుగా ఉన్నవారు అనర్హులు.
ప్రవేట్ రంగంలో పని చేస్తున్నవారు, ప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగింపబడిన వారు అనర్హులు.
దరఖాస్తు చేసుకున్నవారు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందాలి.
ఎక్కువ వయసు ఉన్నవారికే ప్రాధాన్యత.
ఒకే వయసు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నట్టైతే… అవసరమైన విద్యార్హత ఉన్నవారిని సీనియర్ గా పరిగణిస్తారు.
వయసు, విద్యార్హతలు సమానంగా ఉంటే… మార్కులను కొలమానంగా తీసుకుంటారు.
ఏపీలో జన్మించినవారే అర్హులు.
ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే.