కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్.. గతంలో అవకాశం దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, కేఈ ప్రభాకర్, శివానందరెడ్డి తదితరులతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా భేటీ అయిన చంద్రబాబు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. అవకాశం దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ సంచలన ప్రకటన చేసింది. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ‘నైతిక విలువలకు కట్టుబడే రాజీనామా చేశా.. రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ పోటీ చేయాల్సిన అవసరం లేదు. విసిరేసిన పదవిని టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారు’ అని వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.