ఒకరికి తెలియకుండా.. మరొకరిని పెళ్లి చేసుకుని అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిల్ని చాలా మందినే చూశాం.. సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో మోసం చేసింది మాత్రం అబ్బాయి కాదు.. మరి అబ్బాయి కాక.. అమ్మాయి మోసం చేస్తుందా..? అనేగా మీ డౌట్.. అవును మీ డౌట్ వాస్తవమే.. అమ్మాయే ఈ ఘటనకు ఒడిగట్టింది.
ఈ ఘటన కడప జిల్లా ఇటుకులపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పేరు రమాదేవి. చూసేందుకు నల్ల ప్యాంటు, తెల్ల షర్టు వేసుకుని అబ్బాయిలా కనిపిస్తుంది. అలా కనిపించడమే ముగ్గురు అమ్మాయిల పాలిట శాపమైంది. ఆ పెళ్లిళ్ల కథపై ఓ లుక్కేద్దాం రండి..
రమాదేవి పులివెందులలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో మౌనిక అనే అమ్మాయితో పరిచయం పెంచుకుని, అదే అమ్మాయిని అబ్బాయి వేషధారణలో వివాహం చేసుకుంది రమాదేవి. అయితే, శోభనం రోజున రమాదేవి అబ్బాయి కాదని, అమ్మాయి అని తెలుసుకున్న మౌనిక తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో మౌనిక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో రమాదేవి గురించి పలు విషయాలు వెలుగు చూశాయి. అంతకు ముందే వందన, బుజ్జి అనే ఇద్దరు మహిళలను రమాదేవి పెళ్లి చేసుకుని మోసం చేసిందని, వారి తల్లిదండ్రులకు అసలు విషయం తెలియడంతో తమ పిల్లలను రక్షించుకోగలిగారని పోలీసులు వెల్లడించారు.
అయితే, మౌనిక.. రమాదేవి అబ్బాయి కాదు.. అమ్మాయే అని తెలిసి వివాహమాడిందా..? లేక ఇంకేమైన వ్యవహారమా..? అనే ప్రశ్నలను పోలీసులను వెంటాడుతున్నాయి. ఏదేమైనా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.