కర్నూల్ జిల్లా పత్తికొండలో మరోసారి కలకలం రేగింది. హోసూరు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘటనతో అటు ప్రజలు, పోలీసులు ఉలిక్కి పడ్డారు. గ్రామానికి చెందిన నెట్టెప్ప అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. క్షతగాత్రున్ని బంధువులు హుటాహుటిన పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే బాధితుడు చేప్పిన వివరాల ఇలా ఉన్నాయి. గ్రామంలోని వాగు సమీపంలో బహిర్భూమికి వెళ్లి వచ్చి రహదారిపై నిల్చొని ఉండగా అటుగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు నోట్లో గుడ్డలు కుక్కి ఎత్తుకెళ్లారు. గ్రామానికి సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద దింపేసి డబ్బుల కోసం వెతికారు. జేబులో ఉన్న రూ.300 మాత్రం తీసుకొన్నారు. ఆ తర్వాత కత్తితో పొట్టపై పొడిచి హంద్రీనీవా కాలువలోకి తోసేశారు. వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈత రావటంతో కొంతదూరం ఈదుకుంటూ వచ్చి నోట్లో కుక్కిన గుడ్డను తీసేసి బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. రక్త గాయాలతో ఉన్న అతనిని గుర్తించిన బంధువులు, స్థానికులు చికిత్సకై పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ మేరకు సీఐ విక్రమసింహా, ఎస్ఐ మధుసూదన్‌రావు కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధితుడిని పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న పత్తికొండ టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు కేఈ శ్యాంబాబు, పలువురు నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు.
