వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర త్వరలోనే చిత్తూరు నుండి నెల్లూరు జిల్లాకు మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు.. నెల్లూరు జిల్లాలో పాదయాత్రను సక్సెస్ చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగన్ పాదయాత్ర ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని.. చిత్తూరు జిల్లాలో జోరుగా జగన్ పాదయాత్రని సాగిస్తున్నారు. ఇక సీమలోని నాలుగు జిల్లాల్లోనూ జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు.. వైసీపీ శ్రేణులు కూడా ఊహించని విధంగా అక్కడ ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ జగన్ కోసం ప్రజలు వేలల్లో వచ్చి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఓవరాల్‌గా చూసుకుంటే.. అక్కడ జగన్ పాదయాత్ర సక్సెస్ అయినట్లేనని.. వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక జగన్ టెక్నికల్ టీమ్ అయిన పీకే టీమ్ కూడా సీమలో జగన్ పాదయాత్ర వల్ల వైసీపీ తన బలాన్ని రెట్టింపు చేసుకుందని నివేదికలు ఇచ్చి తేల్చేసింది. జగన్ పాదయాత్ర ద్వారా సీమలో వచ్చిన సక్సెస్‌ని ఆంధ్ర ప్రాంతంలో కూడా కొనసాగించాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ఎలాగైనా జగన్ పాదయాత్రను విజయవంతం చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. అందులో భాగంగానే జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను నేడో రేపో ఖరారు చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కొనసాగే అవకాశముంది.