ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గురజాల మండలం దైదాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తూ 56 ఆవులు మృతి చెందాయి. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాల తీసుకువచ్చాడు. ఇవాళ పొలంలో మొక్కజొన్న పంట తీశాక వచ్చిన పిలకలను తిని ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. 56 ఆవులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా… మిగతావి అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఘటనకు స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది. మొక్కజొన్న పంటపై గతంలో జల్లిన పురుగులమందు అవశేషాలు ఆవుల మృతికి కారణమా? లేక మొక్కజొన్న పిలకలు తినడం వల్ల మృతిచెందాయా? అనే విషయాన్ని పశు సంవర్ధక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకేసారి 56 ఆవులు చనిపోవడంతో 10 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని పెంపకందారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
