మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. పాతగుంటూరు బాలాజీనగర్‌లోని ఓ ప్రాంతంలో ఉండే ఈ బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రఘు (20) మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆ బాలికను స్థానికులు ఏం జరిగిందన్నది అడగడంతో జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆ యువకుడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు.అతను అక్కడి నుంచి పారిపోయి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈవిషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద భీభత్సం సృష్టించారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడమే కాకుండా, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత గుంటూరు 144 సెక్షన్ విధించారు. పోలీస్ స్టేషన్ దాడిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యాచారయత్నం చేసిన నిందితుడు రఘును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.