కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం. టీడీపీకి ప్రిస్టేజియ్ నియోజకవర్గం ఇది. కానీ, ఇక్కడ టీడీపీ గెలిచింది మాత్రం తక్కువే. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు కొడాలి వెంకటేశ్వరరావు. కొడాలి వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని. కొడాలి నాని అంటే గుడివాడ రాజకీయం.
మరి ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది…? అభివృద్ధి నిధులను టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తుందా..? లేక ఎదురు చూపులతోనే కాలం గడిచిపోతుందా..? ఎమ్మెల్యే కొడాలి నాని తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారా..? లేక మాటలతోనే కాలం గడిపేస్తున్నారా..? మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుడివాడలో టీడీపీ, వైసీపీ బలా బలాలు ఎలా ఉన్నాయి..? ఒకసారి పరిశీలిద్దాం.
గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం వైసీపీకి కంచుకోటగా మారిందని, అందుకు నిదర్శనంగా 2014 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌పై కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలుపొందడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా.. చివరకు గెలుపొందేది మాత్రం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వారేనని చెబుతున్నారు అక్కడి ప్రజలు.
అయితే, కొడాలి నాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను తలదన్నేలా గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దూరృష్టి సారించారు. ఒక సామాన్య వ్యక్తిగా రాజకీయం ప్రారంభించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన కొడాలి నానికి తమ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాల్సిన పనుల గురించి క్షుణ్ణంగా తెలుసని, వైసీపీ అధికారంలోకి వచ్చాక గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడం ఖాయమంటున్నారు అక్కడి ప్రజలు.
మరో పక్క టీడీపీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. 2019 ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీచేసేందుకు ఓ వైపు టీడీపీ అభ్యర్థులుగా రావి వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు, పిన్నమనేని బాజ్జిలు ఆసక్తి చూపుతుండగా.. మరోవైపు కొడాలి నానిపై పోటీ చేసేది వారెవ్వరూ కాదని, రాజమండ్రి ఎంపీగా ఉన్న మాగంటి మురళీ మోహన్ కోడలు మాగంటి రూపాదేవి పేరు తెరపైకి వచ్చింది.
తనకు పోటీగా టీడీపీ ఎటువంటి ప్రత్యర్థిని నిలబెట్టినా గెలుపు మాత్రం తనదేనంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని, మరో మూడు సార్లు గెలుస్తానని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువగా ఉంటారు. ఎస్సీ ఓట్ల సంఖ్య 40 వేలుకాగా, బీసీల ఓట్ల సంఖ్య 30 వేలుగా ఉంది. 2014లో వీరి ఓట్లన్నీ కొడాలి నానినే దక్కించుకున్నారు. అలాగే, కమ్మ ఓటర్లు కూడా వైసీపీకే మద్దతు పలకడం కొడాలి నానికి ప్లస్‌గా మారనుంది. ఏదేమైనా 2019లో గుడివాడ నియోజకవర్గం ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.