కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్ పంక్షన్ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్ జాయింట్ కమిషనర్(స్టేట్ ట్యాక్స్) నరసింహం.. కాటసాని సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనిమాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బూత్ కమిటీలు కీలకపాత్ర పోషించాలన్నారు. నాలుగేళ్ల తెలుగుదేశం పాలనలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, వర్తకులు, కూలీలు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దగా చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చని ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భ్రమలో ఉన్నారని, డబ్బు రాజకీయాలకు కాలం చెల్లిపోయిందన్నారు. అధికారులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, నాలుగేళ్లలో బనగానపల్లెలో 14 మంది తహసీల్దార్లు బదిలీ కావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలతో నియోజకవర్గంలో అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారన్నారు.
