ఏపీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ప్రధాన కాల్వలు పొంగుతున్నాయి. ఏపీ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగిపోయింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం చందాపురం నల్లవాగు బ్రిడ్జి మీదకు వర్షపునీరు చేరింది. దీంతో నందిగామ, చందర్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంచికచర్ల మండలం కీసర దగ్గర మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాట్రాయి మండలం తమ్మిలేరు రిజర్వాయర్‌కు కూడా భారీగా వరదనీరు చేరింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, వేలేర్పడు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం పోలవరం గ్రామ ప్రజలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ప్రజలు నది పరివాహక ప్రాంతం దగ్గరకు ,కొండ ప్రాంతం దగ్గరకు వెళ్లరాదని, అకస్మాత్తుగా గ్రామంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ బయటికి రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మరో నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అమరావతి ప్రాంతం మునిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొండవీటి వాగు పొంగటంతో సచివాలయానికి రాకపోకలు తెగిపోయాయి.. ఒక్కరోజు వర్షానికే రాజధాని అమరావతి మునిగిపోతే 5రోజులు వర్షం పడితే ఆలోచించాలి. నిపుణుల కమిటీ నిర్ణయాలను పట్టించుకోకుండా వ్యవరిస్తే ఇలానే ఉంటుంది చంద్రబాబు గారు అంటూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్నారు.
