ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్‌లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. మంత్రులు గంటా శ్రీనివాస్, అమర్‌నాథ్ రెడ్డి పేషీల్లో వర్షపు నీరు చేరడంతో కొద్దిరోజుల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా ఛాంబర్‌లోకి వర్షపు నీరు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కార్యాలయంలో కుండపోతలాగా వర్షపు నీరు పడ్డ విషయం విదితమే. ఇలా పదేపదే లీక్ అవుతున్నా దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు భారీగా వినవస్తున్నాయి. అలాగే కోట్లు ఖర్చుపెట్టి కట్టిన సచివాలయంలో వర్షపునీరు రావడం పనుల్లో జరిగిన నాణ్యతలేని తనానికి అద్దం పడుతోంది. సచివాలయానికి వస్తున్న ప్రజలు మాత్రం ఇదేం ఖర్మరా బాబూ.. కోట్లు ఖర్చు పెట్టి కట్టారు.. మళ్లీ మరమ్మత్తులు చేసారు.. అయినా నీరు లీకేజ్ ఏంటని విస్తుపోతున్నారు.
