అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తెచ్చేలా అమానుషానికి పాల్పడింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని 17 ఏళ్ల కొడుకును కడతెర్చింది. మానవ సంబంధాలను మంటగలిపే ఈ దారుణమైన ఘటన విజయనగరం పట్టణంలోని గాయత్రీ నగర్‌లో చోటుచేసుకుంది. గాయత్రీనగర్‌కు చెందిన వెంకట పద్మావతి కొడుకు ముదునూరి హరి భగవాన్ విజయనగరంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అతను మంగళవారం నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. తల్లి వెంకట పద్మావతి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో హరి భగవాన్ మృతిచెందాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే.. వెంకట పద్మావతి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధాల్లో మానవ సంబంధాల్లో రేపుతున్న పెనుమంటలకు ఈ ఘటన నిదర్శనమని స్థానికులు అంటున్నారు.