వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడంపై తమ అధినేత, సీఎం చంద్రబాబు పంపిస్తున్న సంకేతాలు టీడీపీలో ముసలం పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేతల్లో నిరసన స్వరం వినిపిస్తుండగా.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో.. అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం, ఆ పార్టీ నేతలతో ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఓట్లు అడిగితే ప్రజలు సహించే పరిస్థితే లేదని పేర్కొంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గుడ్డలూడదీసి తంతారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించగా.. కాంగ్రెస్ దరిద్రం తమకు వద్దని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి సర్వ నాశనం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు క్షమించబోరని ఒక్క సీటు కూడ గెలవలేం అనే విధంగా మాట్లడినట్లు తెలుస్తుంది. ఇంకా గురువారం కర్నూలులో విలేకరులతో తీవ్ర స్వరంతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ, జగన్.. ముగ్గురూ తమకు శత్రువులేనన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఈ జాబితాలో చేరుతాడన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతున్నారని తెలుస్తుంది.