ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని పార్టీనేతలను టీడీపీ లో చేర్చుకున్నారు. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లను కూడ తెలుగు తమ్ముళ్లు వదలడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ పార్టీలో మాజీమంత్రి ఒకరు చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హాయంలో మంత్రిగా పనిచేసిన కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతో కొండ్రు మురళి పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. ఈనెల 31వతేదీనగాని, లేదా సెప్టెంబర్ 2వతేదీన గాని ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొండ్రు మురళి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యేలోపే టీడీపీ నేతలు అతనితో మంతనాలు జరిపి తమ పార్టీలోకి రావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం
