సార్వత్రిక ఎన్నికల్లో అంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి.
అన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే అధికారమని తేల్చిన నేపథ్యంలో…తెలుగుదేశం పార్టీ నేతలు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజం కావచ్చని లేదా అబద్ధం కావచ్చని.. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. పోల్స్ కేవలం అంచనా మాత్రమేనని తెలిపారు.
కాగా, మరోమారు మోడీపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈసీ తీరు రాజ్యంగ విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఈసీ క్లీన్ చీట్ ఇవ్వడం వివక్షతకు పరాకాష్ట అని విమర్శించారు. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసానే తమ మాటకు విలువ లేదని తెలపడం.. మోదీ నిరంకుశ పాలనకు అద్దం లాంటిదన్నారు. ఈసీని వెంటనే ప్రక్షాళన చేయాలని యనమల, వర్లరామయ్య కోరారు.