ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అండ చూసుకుని కొడుకుతో పాటు కూతురు పూనాటి విజయలక్ష్మి కూడా అక్రమాలకు హద్దు లేకుండా తయారైంది. సొంత తెలివితేటలతో ‘కే’ ట్యాక్స్ విధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సంచలనమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆరోగ్యశ్రీ పర‍్మిషన్ పేరుతో తనను మోసం చేశారంటూ డాక్టర్ చక్రవర్తి బుధవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. చక్రవర్తి నుంచి విజయలక్ష్మి నాలుగు లక్షలు వసూలు చేశారు. దీంతో విజయలక్ష్మితో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాదుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
