ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించడం ఈ విషయాలపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్‌కు అనుభవం, అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ ను ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాకా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనపై ఎంక్వైరీ వేయడం దౌర్భాగ్యం అని.. సీఎం జగన్ ఎంత వేధించినా వెనక్కి తగ్గబోమని మాజీ మంత్రి చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
