ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యుత్ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోపక్క చంద్రబాబు అధికారంలో ఉన్నవారికి, ప్రతిపక్షంలో ఉన్నవారికి వేరే విధంగా నియమాలు ఉండవని అవి సామాన్యేలకైనా ఎంతటి వారికైనా ఒకటేనని వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో లెక్కా? అని పేదలు, తీర ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారిలో తీవ్ర భయాందోళనలను పెంచుతున్నారని మండిపడ్డారు బాబు. ప్రజావేదిక కూల్చివేతను ప్రస్తావిస్తూ, అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను ఓ తప్పు చేశానని, ప్రజా వేదికను తమకు కేటాయించాలని కోరడం తప్పయి పోయిందని చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక భవనాన్ని తనకు కేటాయించాలని తాను లేఖ రాయకుండా ఉండుంటె ప్రజావేదిక కూల్చేవారు కాదన్నారు.
