దశాబ్దాలుగా నరసరావుపేట, సత్తెనపల్లిలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత, నవ్యాంధ‌్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్ పేరుతో గత ఐదేళ్లుగా చేసిన వసూళ్ల దందాపై కోడెలతో సహా ఆయన ఫ్యామిలీపై కేసులు, కేబుల్ టీవీ కుంభకోణంలో కొడుకు శివరామ్‌పై కేసులు, ఫ్లాట్లు కబ్జాలపై కూతురు విజయలక్ష్మీపై కేసులు…మరోవైపు కోడెలను సత్తెనపల్లి ఇన్‌చార్జీ పదవి నుంచి తొలగించాలని సొంత పార్టీ నుంచే అసమ్మతి…ఇలా వరుసగా ఎదురవుతున్న షాక్‌లతో కోడెల రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా కోడెలకు అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్ హోండా షోరూమ్‌ను సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. దీంతో నరసరావుపేట, గుంటూరులోని రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్ చేశారు. దీంతో ఈ వార్త నరసరావుపేట, సత్తెనపల్లిలో సంచలనంగా మారింది. ఇక వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కోడెల కుటుంబం త్వరలోనే జైలుకుపోక తప్పదని, ఇక కోడెల రాజకీయ జీవితం క్లోజ్ అయినట్లే అని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటి సీనియర్ నేత అయినా….చివరకు రాజకీయంగా పతనం కాకతప్పదని…దీనికి ఉదాహరణే కోడెల ఫ్యామిలీ అని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
