కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వైఎస్ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. ఇప్పటికీ, ఎప్పటికీ వైఎస్ జగన్ వెంటే నడుస్తా. కాపుల సంస్కరణలను మంటకలిపిన వ్యక్తి చంద్రబాబు. కాపుల్ని అయోమయానికి గురిచేస్తూ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాటకాలాడారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయంచేస్తానని మా నాయకుడు సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. కాపు కార్పొరేషన్‌లో కొత్త సంస్కరణలు తీసుకువస్తాం. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటాను. ప్రతి రూపాయి కాపులకు అందేలా చూస్తాం’అన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. ఆయన వైఎస్సార్‌సీపీ రాజానగరం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
