వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పయనమవుతున్నారు. ఈ నెల 15 వ తేదీన అమెరికా వెళ్తున్న జగన్ అక్కడ వారం రోజుల పాటు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీన జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు బయలుదేరుతారు. ఈ నెల 17 వ తేదీన డల్లాస్ లోని కన్వెన్షన్ హాలులో జగన్ అమెరికాలో ఉన్న తెలుగు వారితో సమావేశమవుతారు. ఈ సమావేశంలో హాజరయ్యేందుకు అమెరికాలోని వివిధ రాష్ట్ర్రాలలో ఉన్న తెలుగు వారందరికి ఆహ్వానాలు అందినట్లు చెబుతున్నారు. “వెల్ కం సీఎం” అంటూ ఇప్పటికే ప్రవాస తెలుగు ప్రజలు సీఎం జగన్ కి స్వాగతం పలుకుతున్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారి చిన్నారులతో ఆదివారం నాడు వెల్ కం సీఎం అంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రముఖులు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి అమెరికాకు వస్తున్న సందర్భంగా అపూర్వరీతిలో స్వాగతం పలుకుతామని చెప్పారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
