టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీలోని ఫర్నీచర్ ను తన ఇంటికి కోడెల తీసుకెళ్లిన వైనంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఈ విషయంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్తువెత్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కోడెలపై విరుచుకుపడ్డారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద రావు ఏపీ పరువు తీసేశారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీసిన కోడెలపై దొంగతనం కేసులు పెట్టాలని ఆయన సూచించారు. స్పీకర్ హోదాలో ఉండి దొంగతనం చేసిన కోడెల దొంగే అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కోడెల, ఆయన దూడలను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేశా చేశారు. అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలి’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ తో ఎండగట్టారు. ఇప్పటికే కోడెల ఫ్యామిలీ అవినీతి, అక్రమాలపై కేసులు నమోదు అయ్యాయి. కే ట్యాక్స్ పేరుతో నరసరావుపేట, సత్తెనపల్లిలో కోడెల ఫ్యామిలీ సాగించిన అవినీతి దందా అంతా ఇంతా కాదు. కోడెలపై టీడీపీ అసమ్మతి నేతలు కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కోడెలను సత్తెనపల్లి ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించాలని అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన ఇంటికి తరలించిన విషయం బయటపడడం కోడెలకు తలనొప్పిగా మారింది. కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గత ఐదేళ్లలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలన్నింటిని స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతుందని చంద్రబాబు భయపడుతున్నాడు. ఒకవేళ పార్టీలోనే ఉంచుకుంటే…అవినీతిపరులను వెనకేసుకువస్తున్నాడనే అపవాదు వస్తుంది. దీంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక తలపట్టుకున్నాడు. అందుకే కోడెల, ఆయన దూడను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
