రాంగోపాల్ వర్మ సీమ ఫ్యాక్షనిజంపై రక్త చరిత్ర సిన్మా తీశాడు. కానీ వర్మ సీమ రక్త చరిత్ర కంటే దారుణమైనది కోడెల శివప్రసాద్ రాసిన పల్నాడు రక్త చరిత్ర. యస్…ఒక ప్రాణాలు పోసే పవిత్ర వైద్య వృత్తిలో ప్రారంభమైన కోడెల ప్రస్థానం…రాజకీయాల్లో ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగింది. కోడెల శివప్రసాద్ రావుది మొదటి నుంచి వివాదస్పద వైఖరి. కుల, వర్గ రాజకీయ చదరంగంలో ఆరితేరిన
కోడెల అనతికాలంలోనే పల్నాడు రాజకీయాలను శాసించాడు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో రాజకీయాల్లోకి అడుగిడిన కోడెల కాసు కుటుంబానికి కంచుకోట లాంటి నరసరావుపేటలో సై అంటే సై అనేవాడు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి వారసుడు కాసు కృష్ణారెడ్డి సౌమ్యుడు కావడంతో కోడెల రాజకీయంగా ఎదగగలిగాడు.
మూడు దశాబ్దాలకు పైగా కోడెల రాజకీయ ప్రస్థానం గమనిస్తే…హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, ఖూనీలు, దందాలు…ఇవే కనిపిస్తాయి. నమ్మినవారిని అందలం ఎక్కించడం…తనకు ప్రత్నామ్నాయంగా ఎదుగుతారు అనే అనుమానం వస్తే తన పార్టీ వాళ్లని కూడా అధోఃపాతాలానికి తొక్కేయడం..కోడెల నైజం. చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో కోడెలదే ప్రధాన పాత్ర. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు పేరుతో పాటు, కోడెల పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. పల్నాడులో హత్యారాజకీయాలకు, బాంబుల సంస్కృతి పేట్రేగింది కోడెల హయాంలోనే. స్వయంగా తన ఇంట్లో బాంబులు పేలి..నలుగురు అనుచరులు మరణించినా..ఆ ఇల్లు అద్దెకిచ్చా అని రికార్డులు సృష్టించి బయట పడ్డ అరాచకీయవాది…కోడెల.
ఒకానొక సమయంలో గుంటూరు జిల్లా రాజకీయం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని శాసించిన ఘనుడు…కోడెల. తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న నాయకుడి వర్గాన్ని, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయించి…వారిని జైల్లో పెట్టించి..లాఠీ దెబ్బల రుచి చూపించేవాడు. కోడెల వేధింపులు భరించలేక వారు…టీడీపీలో చేరేవారు. అలా నరసరావుపేటలో ప్రత్యర్థులు బలపడకుండా దౌర్జన్యకాండ సాగించేవాడు. నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి వచ్చినా…అక్కడా కోడెల అరాచకీయం ఏ మాత్రం ఆగలేదు సరి కదా…మరింతగా పేట్రేగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి స్థలాలు కబ్జాలు చేయడం, మామూళ్లు వసూలు చేయడం..అపార్ట్‌మెంట్లు కడితే అందులో ఒక ఫ్లాట్ కోడెల ఫ్యామిలీకి రాసివ్వడం..ఇలా కోడెల కబ్జాల పర్వానికి అంతే లేకుండా పోయింది. ఆఖరికి స్వీట్‌షాపులు, రెస్టారెంట్లు, చికెన్ షాపులు…ఇలా ఏ చిరువ్యాపారులను వదిలిపెట్టలేదు ఇలా కే ట్యాక్స్ పేరుతో నరసరావుపేట, సత్తెనపల్లిలలో కోడెల ఫ్యామిలీ వసూళ్ల దందా యధేచ్చగాసాగింది.
హత్యా రాజకీయాలతో రాజకీయంగా ఎదిగిన నాయకుడు..కోడెల. ప్రత్యర్థులను కాదు..తనను నమ్మినబంట్లను, సొంత పార్టీ వాళ్లను కూడా అంతం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం.. కోడెలది. 2009 ఎన్నికల్లో తాను గెలవను అని భావించి కోడెల సానుభూతితో గెలిచే అవకాశం కోసం ప్లాన్ వేశాడు. తనకు అనుంగు శిష్యుడైన ఓ రౌడీ షీటర్ , స్వయానా తనకు మామ వరసయ్యే టీడీపీ కార్యకర్తని చంపి తగలబెట్టి, ఆ నెపం కాంగ్రెస్ నాయకుల మీద నెట్టిన అప్రజాస్వామ్యవాది..కోడెల. అంతే కాదు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లిలో ఓటమి తప్పదని భావించిన కోడెల స్వయంగా స్పీకర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా రిగ్గింగ్‌కు పాల్పడ్డాడు. స్వయంగా యనమట్ల గ్రామంలో తన అనుచరులతో బలవంతంగా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి, గది తలుపులు మూయించి, అధికారులను, సిబ్బందిని బెదిరించి రిగ్గింగ్ చేయిస్తుంటే తట్టుకోలేని యనమట్ల గ్రామ ప్రజలు కోడెలను బయటకు తీసుకువచ్చి చితకబాదారు. ఆ సమయంలో కోడెల తన చొక్కా తానే చింపుకుని వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారు అనేలా డ్రామాలు ఆడాడు. అయితే కోడెల అరాచకాలు సహించలేని ప్రజలు ఆయన్ని చిత్తుగా ఓడించి ఊపిరి పీల్చుకున్నారు.
టీడీపీలో ప్రబల శక్తిగా ఎదిగిన కోడెల ఇప్పుడు రాజకీయంగా విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో కోడెల ఫ్యామిలీ సాగించిన అరాచక, అవినీతి పనులు బయపడుతున్నాయి. స్వయంగా కే ట్యాక్స్ బాధితులు కోడెల ఫ్యామిలీపై కేసులు పెట్టారు. కోడెలతో సహా ఆయన కొడుకు , కూతురు కూడా కేసుల్లో మునిగిపోయారు. ఒకప్పుడు గుంటూరు జిల్లాను ఒంటి చేత్తో శాసించిన కోడెల ఎన్నడూ లేనంతగా ప్రజలచే చీత్కారాలు పొందుతున్నారు. ఎంతంటి అవినీతి చక్రవర్తులైన, దౌర్జన్యకారులైన చివరకు పతనం తప్పదు. దశాబ్దాలుగా హింసా రాజకీయాలు, దౌర్జన్యాలు, ఖూనీలు, దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కోడెల శివప్రసాద్ రావు రాజకీయం జీవితం ఇప్పుడు చరమాకంంలో ఉంది. ఇది కోడెల రాసిన పల్నాడు రక్త చరిత్ర.. రాజకీయాలకే చెరగని మచ్చ.